2024 ఎన్నికల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికల నిర్వహణపై ఈసీ పునరాలోచించాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఏపీలోని ఎన్నో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని, నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతే పోలయ్యాయన్నారు. సాయంత్రం 6 తర్వాత పెరిగిన ఓట్లపై ఈసీని విచారణ అడిగాం అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలు ఈసీని కలిశారు.
ఈసీ సమావేశం అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై పునరాలోచించాలి. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలు, ఓటర్ లిస్టుల విషయంలో చర్చ జరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి అనుమానాల నివృత్తిపై సమావేశం నిర్వహించాం. 2024 ఎన్నికల్లో ఈవీఎంల తీరుపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలకు, వీవీప్యాట్‌లను కంపారిజన్ చేయమని అడిగాం. బ్యాటరీ చార్జింగ్ విషయంలో కూడా మా అనుమానాలను అడిగాం. పోలింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు బ్యాటరీ చార్జింగ్‌లో మార్పులను కూడా ప్రశ్నించాం. సాయంత్రం 6 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతే పోలయ్యాయి. సాయంత్రం 6 తర్వాత పెరిగిన ఓట్లపై విచారణ అడిగాం. వీవీప్యాట్‌ల విషయంలో కౌంటింగ్ చేయడానికి వీలులేదని ఎన్నికల సంఘం నిర్బంధంగా చెబుతోంది. బ్యాటరీ చార్జింగ్ విషయంలో రీఛార్జిబుల్ బ్యాటరీలు అని చెప్పారు. ఎక్కువ శాతం పెరిగిన ఓట్లపై పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Also Read: Shubman Gill: రెండో టెస్టులోనే.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు సమం! గిల్ సూపరో సూపర్
‘రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగింది. రాయచోటి నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య పెరిగింది. ఓటర్స్ డేటా తెప్పించి చూస్తామని చెప్పారు. బీహార్లో లాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ఆంధ్రప్రదేశ్లో చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంది. ఈవీఎంలపై టెక్నికల్ డౌట్స్ ఉన్నాయని ఆధారాలతో అడిగాం. హిందూపూర్లో పోలింగ్ బూతుల వివరాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. ఓడిపోయామని ఈవీఎంలపై నేపం చూపెట్టట్లేదు. ప్రాక్టికల్గా మా వద్ద ఉన్న ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘం ముందు పెట్టాం. వైసీపీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే.. అసెంబ్లీలో ఒక ఓటు మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ఒక ఓటు వస్తే.. అసెంబ్లీకి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీకి పార్లమెంట్లో 8 ఓట్లు వస్తే.. అసెంబ్లీకి 95 ఓట్లు వచ్చాయి. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. పార్లమెంటుకు అసెంబ్లీకి ఓటింగ్ ప్యాట్రన్లో చాలా వ్యత్యాసం వచ్చింది. ప్రపంచంలో ఉన్న అభివృద్ధి దేశాల్లో యూస్, జర్మనీ, యూరప్ లాంటి దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి . భారతదేశంలో కూడా పునరాలోచించాలి’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.