చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు.
వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు. మమ్మల్ని బలవంతంగా కర్లలోకి ఎక్కించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా దీక్ష చేసే హక్కు మాకు లేదా..? దీక్ష చేస్తున్న మాపై దాడి చేయడం తాలిబన్ల చర్యలాంటిందని’ షర్మిల ఆరోపించారు.
‘రాష్ట్రం తాలిబన్లలా కేసీఆర్ చేతిలో బందీ అయ్యింది. చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడు. జగిత్యాలలో కూడా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోరు అన్న ధైర్యమే దాడులకు కారణం అవుతుంది. ఈరోజు యువత ఆశయం లేకుండా బ్రతుకుతుంది. డ్రగ్స్, గాంజా, మద్యం ఎక్కువగా దొరుకుతుంది. ఈ మత్తు పదార్ధాలవల్లే యువత పాడై పోతుందని’ షర్మిల తెలిపారు.
‘300 బడులు తీసేశారు, 14,000 మంది టీచర్లను తొలగించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం మహిళల పైన దాడులు విపరీతంగా పెరిగాయి. ఏమి స్పందించలేరన్న ఆలోచనతోనే చిన్నారులపై అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇది బంగారు తెలంగాణ నా, బరబాద్ అవుతున్న తెలంగాణ నా..? వీటన్నిటికీ కారణం కేసీఆర్ నే..’ అని షర్మిల ఆరోపణలు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి 10 లక్షల రివార్డు ప్రకటించడం కేసీఆర్, పోలీసుల వైఫల్యమేనని ఆమె పేర్కొన్నారు. వాళ్ళు తాగుబోతులు గనక, రాష్ట్రాన్ని కూడా తాగుబోతు రాష్ట్రంగా మారుస్తున్నారని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.