YSRCP: ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు ఓ వైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. ఐదో సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలో సిద్ధం భారీ బహిరంగ సభ జరగనుంది.. ఇక, ఈ రోజు నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మేమంతా సిద్ధం పోస్టర్ ను విడుదల చేశారు వైసీపీ నేతలు.. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి.. జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. 5న సభలపై నేతలతో సమీక్షా సమావేశాలు ఉంటాయని తెలిపారు. ఇక, నెల్లూరులో 6న సీఎం జగన్ ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది నేతలతో సమావేశమవుతారని వెల్లడించారు. కావలి సమీపంలోని వెంగయ్య గారి పాలెంలో 6వ తేదీన సిద్ధం సభ జరుగుతుంది.. ఈ సిద్ధం సభలకు స్పందన అనూహ్యంగా ఉంది.. కావలి సభకు లక్ష మందికి పైగా హాజరవుతారని తెలిపారు విజయసాయిరెడ్డి.
ఇక, నాలుగు సిద్ధం సభలు విజయవంతమయ్యాయి.. కావలిలో జరిగే ఐదో సిద్ధం సభ కోసం కూడా ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం. టీడీపీకి నామ మాత్రపు సీట్లు మాత్రమే వస్తాయన్నారు. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు మేమంతా సిద్ధం కార్యక్రమం ఉంటుంది.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు వద్ద జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందన్నారు. 5న యాత్రకు విరామం ఉంటుంది.. 6న కావలిలో బహిరంగ సభ జరుగుతుందని.. అనంతరం కందుకూరు నియోజకవర్గంలో యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చంద్రశేఖర్ రెడ్డి.