YSRCP Samajika Sadhikara Bus Yatra: ఆంధ్రప్రదేశ్ వరుస యాత్రలతో హోరెత్తిపోతోంది.. ఓ వైపు ఈ రోజు నుంచి నారా భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా.. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి బస్సు యాత్రలు ప్రారంభించనుంది.. సామాజిక సాధికార యాత్ర పేరుతో.. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర సాగించనుంది వైసీపీ.. రేపు ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. ఈ సందర్భంగా.. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున..
పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో 3 దశల్లో సామాజిక సాధికార యాత్ర సాగుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఏ రకంగా జరిగిందో ప్రజలకు వివరిస్తాం.. సామాజిక ధర్మం పాటించిన ఎకైక నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. పెత్తందార్లకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ఒక తాటిపై నిలిచి సామాజిక భేరి వినిపించనున్నాం అన్నారు. రేపు ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. కేబినెట్ నుంచి అన్ని పోస్టుల్లో సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేశారని ప్రశంసలు కురిపించారు. ఈ రోజుకు అయినా నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైల్లో ఉన్నాడు అని పేర్కొన్నారు మంత్రి జోగి రమేష్.. సామాజిక సాధికార యాత్ర పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా.. భువనేశ్వరికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కాదు పాపపు పరిహార యాత్ర చేస్తే బాగుండేదని సెటైర్లు వేశారు.. ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసే విధంగా యాత్ర చేయాల్సిందన్నారు.
తాడేపల్లి
ఇక, చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు, వివక్ష కొనసాగిందన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున.. దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని చంద్రబాబు అహంకారం ప్రదర్శించాడని దుయ్యబట్టిన ఆయన.. మంత్రులు కూడా దళితులను చులకనగా చూశారని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు టీడీపీకి 23 స్థానాలకు పరిమితం చేసింది.. రాష్ట్రంలో దొంగలు తయారు అయ్యారు.. అందుకే ఈ సామాజిక సాధికార యాత్ర అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గిందని చెప్పుకొచ్చారు.. ఈ విషయాలు ప్రజల దగ్గరకు తీసుకుని వెళతాం.. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం అని వెల్లడించారు. మేం ప్రజల కోసం బస్సు యాత్ర చేస్తుంటే టీడీపీ జైల్లో ఉన్న వాడి కోసం బస్సు యాత్ర చేస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరిస్తాం అన్నారు. బ్యాక్ వార్డ్ క్లాస్ అంటే బాబు క్లాస్ అని చెప్పి ఈ వర్గాల ఓట్లు వాడుకున్నారు అని ఆరోపించారు మంత్రి సురేష్.