YSRCP Target Pawan Kalyan: పవన్ కల్యాణ్ మీద మాటల దాడి విషయంలో వైసీపీ రూటు మార్చిందా? నిన్నటిదాకా డైరెక్టుగా జనసేనానికి విమర్శించే వైసీపీ నేతలు.. సడెన్‌గా వాయిస్ ఎందుకు మార్చారు? పవన్ మాటలన్నీ చంద్రబాబువే అని నిన్న ద్వారంపూడి అంటే.. మంత్రి రోజా కూడా అదే కోణంలో విమర్శించారు? వైసీపీ నేతల ప్రకారం చంద్రబాబు వ్యూహం ప్రకారమే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారా? ఇప్పుడీ యాంగిల్లో ఏపీ రాజకీయాలు చర్చించుకుంటున్నాయి! వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆరోపణలన్నీ చంద్రబాబు ఇంటి నుంచే వస్తున్నాయనేది వైసీపీ నేతల లేటెస్ట్ వెర్షన్.
ఆయన డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలని వపన్ మొదటి రోజు చెప్పిన దగ్గర నుంచి గెలిపిస్తే సీఎం అవుతానంటూ చెప్పిన డైలాగ్ వరకు టీడీపీనే చెప్పించిందని పలువురు ఆరోపిస్తున్నారు. బాబు ఫిలాసిఫీనే వపన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారనే విమర్శలు పదునెక్కాయి. ఇక, చంద్రబాబు వ్యూహం ప్రకారం తనను తిట్టేందుకే కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ రూరల్‌లో సభలు పెట్టారని ద్వారంపూడి విమర్శించారు. కాపు, రెడ్డి సామాజికవర్గాలు చాలా సఖ్యంగా ఉంటాయన్నారు. తనపై వ్యాఖ్యలకు జనం తిరగబడితే ఒక రెడ్డి ఎమ్మెల్యే ఇలా చేశాడని ప్రచారం చేయాలనే చంద్రబాబు, పవన్ కుట్ర పన్నారని ద్వారంపూడి చెప్పుకొచ్చారు.
మరోవైపు.. బూతులు చెప్పించి వాళ్ల పేపర్లలో హెడ్ లైన్స్ వేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. వాళ్ల పని అయ్యాక చిరంజీవిని ఎలా లాగి పడేశారో, పవన్నీ అలాగే లాగేస్తారని అన్నారు. చంద్రబాబు మోసం చేస్తాడని చిరంజీవి 2013లోనే పవన్ కల్యాణ్‌కి చెప్పాడని రోజా గుర్తు చేశారు. ఇప్పటికైనా మీ అన్నయ్య మాట విని షూటింగ్స్ చేసుకుంటే ఆర్టిస్టుగా అందరూ గౌరవిస్తారని సలహా కూడా ఇచ్చారు. ఇటు సినిమాలకు చెడి.. అటు రాజకీయంగా చెడిపోతారని రోజా సెటైర్ వేశారు. వారాహి వచ్చినా నారాహి వచ్చినా ఏం ఉపయోగం లేదన్నారామె. గుంపులుగా రాకుంటే జగనే మళ్లీ సిఎం అవుతారని పవన్ చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు.