YSRCP: ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు కసరత్తు వేగంగా జరుగుతోంది. సీట్ పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కాకుంటే తమ ఫ్యామిలీలోనే సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అసెంబ్లీ సీట్లు వదులుకునేందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు.
Read Also: Vishnuvardhan Reddy: ఏపీలో బీజేపీ నిర్ణయించిన పార్టీదే అధికారం..
అరకు ఎంపీ అభ్యర్ధిగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజును పార్టీ ఎంపిక చేయగా.. పార్టీ ప్రతిపాదనకు అంగీరిస్తూనే పోలవరం సీట్ తన భార్యకే ఇవ్వాలని బాలరాజు పట్టుబడుతున్నట్లు తెలిసింది. పత్తిపాడులోనూ అదే సీన్ జరిగినట్లు తెలుస్తోంది. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌ను పక్కన పెట్టేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. సీటు పోతోందని క్లారిటీకి వచ్చిన పూర్ణ చంద్రప్రసాద్.. తను తప్పుకోడానికి అంగీకారమేనని.. అయితే తన ప్లేస్‌లో తన భార్యకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ రెండు సీట్ల దగ్గరే సమస్య వచ్చిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తేలితే…. ఉభయగోదావరి జిల్లాల్లో మార్పులు, చేర్పులపై పార్టీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అయినా… ఎమ్మెల్యే ఫ్యామిలీ అయినా వ్యతిరేకతకు ఒక్కటేననే భావనలో వైసీసీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు నచ్చచెబుతున్నారు. పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని, అనంతరం వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని బుజ్జగిస్తున్నారు. సున్నితంగా హ్యాండిల్ చేయాలని జగన్ సూచిస్తున్నారు.
Read Also: CM Review: ఉమ్మడి ఏపీ భవన్ విభజన, తెలంగాణ భవన్ నిర్మాణంపై సీఎం సమీక్ష
నెక్ట్స్ కోటా రాయలసీమ
ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు తాడేపల్లి నుంచి కబురు రాగా.. జోన్ల వారీగా తొలగింపు ఎమ్మెల్యేల జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసుకున్నారు. తర్వాత రాయలసీమ గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ ప్రభావం ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తేనే గెలుస్తాం అనే గట్టి అభిప్రాయంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పని తీరు మార్చుకోవాలని చాలా సార్లు జగన్ హెచ్చరించారు. కొంత మంది ఎమ్మెల్యేల ప్లస్‌లు, మైనస్‌లు స్వయంగా చెప్పినా.. తీరు మార్చుకోని వారిపైనే వేటు పడినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలోకానీ, రాష్ట విభజన తర్వాత కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో సిట్టింగ్‌లను అధికార పార్టీలు మార్చలేదు. ఎమ్మెల్యేల మీద స్థానిక వ్యతిరేకత, నియోజకవర్గ స్థాయిలో నేతలతో విభేదాలు, టీడీపీ-జనసేన పొత్తులో పోటీకి వచ్చే అభ్యర్థులను ఈ సమీకరణలలో జగన్ ముఖ్యంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమికి చెక్ పెట్టేలా సామాజిక సమీకరణలతో ఎమ్మెల్యేల మార్పు, తొలగింపు, కొత్త అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.