Kakinada YCP Politics: వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై వైసీపీ అధిష్ఠానం పూర్తిగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై సీఎం జగన్ చాలా రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
Read Also: Mahadev Betting App Scam: వైజాగ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్
ఈ క్రమంలో వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. చలమలశెట్టి సునీల్ పోటీకి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. 2014లో వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్‌ను గీత స్థానంలో పోటీ చేయించాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇదే విషయాన్ని సునీల్ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ ఆయన మాత్రం కాకినాడ నుంచి పోటీ ప్రసక్తే లేదని వైసీపీ పెద్దలకు తేల్చి చెప్పేశారు. కాకినాడ ఎంపీ సీటు నుంచి ఇప్పటికి మూడుసార్లు వేర్వేరు పార్టీలనుంచి పోటీ చేసినా కలిసి రాక వరుస ఓడిపోయి నా తనకు ఇకపై బరిలోకి దిగే ఆసక్తి లేదని చెప్పేశారు. వాస్తవానికి కాకినాడనుంచి ఎంపీగా గెలవాలనే పట్టుదలతో సునీల్ హైద రాబాద్‌నుంచి వచ్చి కాకినాడ ఎంపీ సీటుకు 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసినా ఓటమి పాలయ్యారు. వరుసగా మూడుసార్లు ఓటమి పాలవడంతో ఇకపై కాకినాడనుంచి బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆయన కాపు సామాజికవర్గం నేత కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతో గీత స్థానంలో ఈయన్నే మళ్లీ దించాలని వైసీపీ భావిస్తోంది. కానీ సునీల్ మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెప్తున్న సునీల్‌ను పార్టీ పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుకి మరొక సారి పార్టీ ప్రపోజల్ పెట్టింది. పార్లమెంట్‌కి పోటీ చేయడానికి మరొక సారి అభ్యర్థుల వడపోతను పార్టీ చేపట్టింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం కోఆర్డినేటర్‌గా వైసీపీ నియమించింది.
ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ గెలవాలనే నినాదాలు వినిపిస్తున్న జగన్ దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికపై ముందుగానే అలర్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాల్లో మార్పులు చేర్పుల అనంతరం సంక్రాంతి తర్వాత నాలుగో విడత జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.