Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టారని, గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యం అందించారని.. మండలానికి రెండు పీహెచ్సిలు ఉండాలనే ఆలోచనతో 80 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేసారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పటిష్టం చేశారని, ఆరోగ్య రంగంలో 54 వేల ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పేదప్రజలకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందేలా చేశారని ఆయన అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగన్ పనిచేశారని, చంద్రబాబు పిపి విధానంలో వైద్యం అందిస్తామంటున్నాడని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నాడని, జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వైద్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వమని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్లలో 14 లక్షల మందికి 13 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించారని, ఈ ప్రభుత్వం 3500 కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తే 500 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. ఈ ప్రభుత్వ వైఖరిచో ఆసుపత్రులు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయని ఎద్దేవా చేసారు.
ఆరోగ్యశ్రీని కొనసాగిస్తారా..? ఆపేస్తారా? అనిచంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్స్యూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని, అందుకే నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతోందని ఆయన అన్నారు. ఆరోగ్య శ్రీ కింద బైపాస్ సర్జరీ చేయించుకుంటే ఆసుపత్రులు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయని.. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన మానుకోవాలని కోరుతున్నట్లు ఆయన అన్నారు. జగన్ మీద కోపంతో ప్రజాఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చూడొద్దని అన్నారు.