YS Subba Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నా.. అప్పుడే.. నేతలు ఎక్కడ నుంచి పోటీ చేయాలి.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగితే బెటర్.. ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మంచిదా? అనే విషయాలపై నేతలు ఫోకస్ పెట్టారు. అయితే, ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు చూసి మరోసారి ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతున్నారు అన్నారు.
ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక, సాధికార బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూస్తే విపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. మా కార్యక్రమాలను చూసి.. వాళ్లు మేనిఫెస్టోలు తయారు చేసుకుంటున్నారు అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు. మా పథకాలను చూసి మాకు ప్రజలు పట్టం కడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితమంటూనే దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. గతం కన్నా ఇప్పుడు ఇసుక మెరుగ్గా దొరుకుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఏ మేరకు అవసరం ఉంటుందో ఆ మేరకు ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.