రాష్ట్రంలో నచ్చని వారిపై కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని, అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా అని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని, ప్రతీ చోటా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీని చూస్తే ఆక్రోశం వస్తోందని జగన్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వంశీని ములాఖత్‌లో జగన్ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ మాట్లాడారు.
ములాఖత్ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘పొద్దున్నే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఓ పథకం ప్రకారం ఇదంతా చేశారు. లా అండ్ ఆర్డర్‌ను తప్పుదోవ పట్టించారు. రాష్ట్రంలో నచ్చని వాళ్ళపై కేసులు పెట్టిస్తున్నారు. నెలలు నెలలు జైలులో పెట్టించే కార్యక్రమం ఇది. నిన్న పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చేశారు. ఒక్క సభ్యుడు లేకపోయినా వైస్ చైర్మన్ పదవి గెలుచుకున్నాం అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. తిరుపతిలో కూడా అదే పద్ధతిలో చేశారు. బస్సుల్లో వెళ్తున్న వారిని కిడ్నాపులు చేశారు. తునిలో 30కి 30 వైసీపీ గెలిచింది. వైసీపీ వాళ్లను దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. పాలకొండ లో కూడా అంతే’ అని జగన్ అన్నారు.
‘పోలీసులను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు వారి టోపీ మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయండి, ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదు. అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం. మీరు ఎక్కడ ఉన్నా తీసుకువస్తాం. ప్రజాస్వామ్యం కూలిపోతుంది. ప్రతీ చోటా వీళ్లే కేసులు పెడుతున్నారు.. వీళ్లే బెదిరిస్తున్నారు. వీళ్లను బెదిరించే వారు ఎవరు. సీఎం చంద్రబాబుకు వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్నదని ఆక్రోశం. తన కన్నా, నారా లోకేష్ కన్నా బాగున్నాడని ఆక్రోశం. ఇదొక మాఫియా రాజ్యం. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి చాలా చేశారు. ఎదురు తిరిగి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం.. ఇబ్బందులు పెట్టడం లోకేష్ నైజం’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.