పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెంటపాళ్ల పర్యటనకు జనం ఎలా వచ్చారో చూశారు కదా?.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కర్ఫ్యూ లాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందని, తమ పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం మీడియా సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నాణేనికి రెండవ వైపు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రజలకు రెండవ వైపు స్టోరీ తెలియాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిగజారిపోయింది. మోసాలు, అబద్ధాల మధ్య చంద్రబాబు పాలన సాగుతోంది. వెన్నుపోటు దినం పేరిట వైసీపీ ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల నుంచి ప్రజల స్పందన బాగుంది. ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది లోపే ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నది.. దేశ చరిత్రలో కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఒక నియంత మాదిరిగా అణిచి వేయాలని చూస్తున్నారు. నిన్న సత్తెనపల్లిలో నా ప్రోగ్రాం ఒక కర్ఫ్యూ లాగా చేద్దామన్నారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి?. ప్రోగ్రాంకు రాకూడదు అని ఆంక్షలు పెట్టారు. కార్యక్రమానికి వచ్చే జనాన్ని కట్టడి చేశారు. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అని నేను చెప్పాల్సింది ఏమీ లేదు.. అందరూ చూశారు. ఒక ప్రతిపక్ష నేత ప్రజల దగ్గరకు వెళ్తే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు?’ అని జగన్ ప్రశ్నించారు.
‘పొదిలి పొగాకు రైతుల కోసం వెళ్తే ప్రజలు వేలాదిగా స్పందించారు. గిట్టుబాటు ధరలు లేక ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నలభై వేల మంది వచ్చిన కార్యక్రమానికి కేవలం 40 మందితో నిరసన పెట్టారు. 40 మందితో డిస్ట్రబ్ చేయాలని చూశారు. సమన్వయం పాటించారు కాబట్టే.. 40 వేల మంది 40 మంది మీద తిరగబడలేదు. అయినా ఉల్టాగా రైతులపై కేసుల పెట్టారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావటం లేదు. ఏ పంటకు మద్దతు ధర లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అయినా ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.