అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్‌సుఖ్ మాండవీయను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి చెప్పారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కేంద్రమంత్రి మాండవీయతో లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ నారా లోకేష్ మాట్లాడుతూ… అమరావతిలో రాజధాని నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ‘క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు నివ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించండి. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత అందించండి. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్.. కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో హాకీ, షూటింగ్‌లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ.341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపండి’ అని లోకేష్ కోరారు.
Also Read: Extramarital Affair: కూతురి వివాహేతర సంబంధం.. మనవరాళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న అమ్మమ్మ, అవ్వ!
‘తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్‌ను తిరుపతిలో నెలకొల్పండి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయండి. దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్‌లను మంజూరు చేయండి. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలి’ అని కేంద్రమంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి మాండవీయ స్పందిస్తూ… ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం, ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రికి లోకేష్ అందజేశారు.