ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నేడు గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్ వచ్చారు. మిర్చి రైతుల కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
మిర్చి రైతుల సమావేశం అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయింది. రైతుల దీనస్థితికి ప్రభుత్వం కారణం కాదా?. మా హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారింది. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదు. మా హయాంలో రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేది. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది’ అని జగన్ అన్నారు.
‘వైసీపీ హయాంలో రైతే రాజు కానీ.. కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు, రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి. ఈ ఏడాది మిర్చి దిగుబడి బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డ్‌కు రావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. రైతులకు అండగా వైసీపీ ఎప్పుడూ ఉంటుంది’ అని వైఎస్ జగన్ చెప్పారు. జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు, రైతులు, జనాలు వచ్చారు.