తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. బెట్టింగ్‌లో డబ్బు కోల్పోయిన ఓ యువకుడు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో మోజు పడి భారీగా డబ్బును పెట్టుబడి పెట్టాడు. అయితే, కొద్ది రోజులుగా జరిగిన మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోవడంతో రూ.2 లక్షలు కోల్పోయాడు. అప్పులు పెరగడంతో మనస్తాపానికి
గురైన అతను, కుటుంబ సభ్యులకు చెప్పకుండా గౌడవెల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
READ MORE: Kumal Kamra: కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే
సోమేశ్ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ముఠాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిస కాకుండా, పొదుపు మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు.
READ MORE: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంని కలిసిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి.. ఎందుకంటే?