కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దాంతో వైసీపీకి చెందిన మేయర్ సురేశ్ బాబు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పక్కనే తనకు కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు. ‘హూ ఈజ్ జైశ్రీ’ అంటూ మేయర్ స్టేడియం వద్ద నినాదాలు చేశారు. రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని.. నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు? అని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మండిపడ్డారు. దాంతో పోడియం వద్ద టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడుతూ… ‘మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. మేయర్ సురేశ్ బాబు తన కుర్చీని లాగేస్తారని భయపడుతున్నారు. అందుకే కాబోలు కుర్చీలాట ఆడుతున్నారు. అధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు మహిళలు అంటే చిన్నచూపు. అందుకే మహిళలను నిలబెట్టారు. మేయర్ పక్కనే మహిళ ఎమ్మెల్యేకి కుర్చీ వేయాలి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంకు ఎలా కుర్చీలు వేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకపోవడంలో ఆంతర్యం ఏంటి. హూ ఈజ్ జైశ్రీ, రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు?’ అని ప్రశ్నించారు. దాంతో మేయర్, ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు సాగాయి.
Also Read: MLA Parthasarathi: నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే.. ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు!
కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిలబడే ఉన్నారు. మేయర్ కుర్చీకి ఒక వైపు టీడీపీ, మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు నిల్చొని నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మేయర్‌కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు కింద బైఠాయించి నిరసన తెలపగా.. ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వాలంటూ టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. పోటాపోటీ నినాదాలతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.