టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొరిగే కుక్క కరవద అని.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతేనని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు పాఠం చెప్పారని.. వచ్చే 25 ఏళ్ళు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసీపీకి పొత్తుల అవసరం లేదని.. జగన్ సోలో ఫైట్‌నే నమ్ముకున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఒక్క ఎన్నికల్లో అయినా ఒంటరిగా పోటీ చేశారా అని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసొచ్చినా ప్రజలు వైసీపీ పక్షమే అని తేల్చి చెప్పారు. టీడీపీ నేతల వల్లే రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ బడా నాయకుల అండతోనే టీడీపీ కార్యకర్తలు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా విశాఖ పాలనా రాజధాని అయితీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
అటు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలు శవం మాట్లాడినట్లు ఉన్నాయన్నారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడు ఉన్నాడని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పుడో చంద్రబాబును క్విట్ చేసి రాష్ట్రాన్ని సేవ్ చేశారని తెలిపారు. కరోనా సమయంలో చంద్రబాబు గనుక ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేమన్నారు. టీడీపీ, జనసేనకు మధ్య సమన్వయం ఏ రకంగా ఉందో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుందన్నారు. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి లాంటి టీడీపీ ఏజెంట్లు కూడా ఇప్పుడు పొత్తులపై స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు ఒక పక్క త్యాగం అంటున్నాడు, మరో పక్క నాయకత్వం వహిస్తాను అంటున్నాడని.. తానే శాశ్వతం, అన్నింటికీ అతీతుడిని అనే భావజాలం చంద్రబాబులో కనిపిస్తోందని సజ్జల ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా దేవుడి చూపుతో పాటు ప్రజల ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయని సజ్జల తెలిపారు.