ఏపీ మినిస్టర్ రోజా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త సెల్వమణి అన్న మాటలను వారు వక్రీకరించి తప్పుగా అర్థమయ్యేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రోజా భర్త ఆర్. కె సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇక ఇటీవల ఆయన మీడియా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా షూటింగ్ చేస్తున్నారని, అలా చేయడం వలన తమిళ సినీ కార్మికులను నష్టం జరుగుతోందని అన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదని.. అయితే, భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పుకొచ్చారు.
ఇక ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. భర్త అన్న మాటలకు రోజా క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు కోరారు. ఇక తాజాగా ఈ విషయమై రోజా స్పందించింది. తన భర్త మాటలను తప్పుగా వక్రీకరిస్తున్నారని తెలిపారు. “నా భర్త వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు ఆ రాష్ట్రం లోనే పని చేసేలా ఉంటే అందరికీ ఉపాధి లభిస్తుందని ఆయన ఉద్దేశ్యం. ఆ వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ప్రజలకు వేరే అర్ధం వచ్చేలా వక్రీకరిస్తున్నారు. ఆ లెక్కన విశాఖ లో షూటింగ్స్ చేయమని ప్రభుత్వం జీవోనే ప్రకటించింది. మరి తెలుగు సినిమా నిర్మాతలు అక్కడ షూటింగ్ లు చేస్తున్నారా..? మాకు, జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం ఉంది కాబట్టి మేము అక్కడ ఇళ్ళు కట్టుకున్నాం.. మరి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎందుకు ఏపీలో ఇల్లు కట్టుకోలేదు. అందరికి మంచి జరుగుతుంది అని నా భర్త చెప్పిన మాటలను టీడీపీ తమ స్వార్థం కోసం వాడుకొంటుందని” తెలిపారు. ప్రస్తుతం ఈ వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి.