Margani Bharat: మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని ఆయన ఆరోపించారు. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలనూ టీడీపీ కాపీ కొడుతుందని ఆయన ఆరోణలు చేశారు. దసరాకు టీడీపీ ప్రకటించబోయే మేనిఫెస్టో తెలంగాణ ఎన్నికల్లో కాపీ కొట్టేదే అవుతుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో 640 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. ఆ మేనిఫెస్టోని వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. దివంగత వైయస్సార్ చంద్రబాబుని ఆల్ ఫ్రీ బాబు అనేవారని.. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ఫుల్ ఫ్రీ బాబు అవుతారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు.
Read Also: YSR Bima: వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం.. వారికి రూ.5లక్షల సాయం
సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తోందని, ప్రజలంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మార్గాని భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లుగా సమర్థవంతమైన పాలన అందించి, ‘జయహో జగనన్నా’ అని ప్రతిఒక్కరి నుంచి అనిపించుకుంటున్న ఏకైకా సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. రాజమండ్రి నగరాన్ని నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దామని, మరెంతగానో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి.. తన డొల్లతనాన్ని బయట పెట్టుకుందని మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి.. కుర్చీని, పార్టీని చివరికి బ్యాంకు అకౌంట్లు కూడా లాక్కుని మానసికంగా, శారీరకంగా హింసించి వేధించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ మా దేవుడంటూ విగ్రహాలకు దండలు, శతజయంతులు నిర్వహించి.. ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారన్నారని విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ ఉన్నప్పుడు మహానాడు అంటే అదొక పెద్ద పండుగగా అందరూ భావించే వారని, కానీ చంద్రబాబు నిర్వహించే మహానాడు ఒక రాజకీయ స్వార్థం, వసూళ్ళ కోసం అన్నట్టుగా మారిందని మార్గాని భరత్ దుయ్యబట్టారు. మొన్న జరిగిన మహానాడుకు రాజమండ్రి నుండి కనీసం పదివేల మంది కూడా హాజరు కాలేదంటే.. ఆ పార్టీపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అర్థమవుతోందని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. తమని, తమ పార్టీని మనస్ఫూర్తిగా అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు.. ప్రజల వద్దకు ర్యాలీగా బయల్దేరి వెళుతున్నామని, వారితో కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటామని చెప్పారు.