WFI controversy: లైంగిక ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ మూడు రోజులుగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లు ఎట్టకేలకు శాంతించారు. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా దిగి వచ్చి ఈ సమస్యలపై వినేష్ ఫోగాట్, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, రవి దహియాతో పాటు మరికొంతమంది రెజ్లర్లతో రెండోసారి కూడా చర్చలు జరిపారు. దీనిలో భాగంగా భూషణ్‌ను ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పిస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు. అంతేకాకుండా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఐఓఏ కమిటీని కూడా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రెజ్లర్లు తమ నిరసనలను విరమించారు.
Read Also: Dera Baba: పెరోల్ పై బయటకు వచ్చిన బాబా.. మరి ఈ సారి డేరా ఎక్కడో
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు శుక్రవారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్, ఆర్చర్ డోలా బెనర్జీ, దిగ్గజ రెజ్లర్ యోగేశ్వర్ దత్, అలక్‌నంద అశోక్ (ఐఓఏ సంయుక్త కార్యదర్శి), సహ్‌దేవ్ యాదవ్ (భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఐఓఏ కోశాధికారి), న్యాయవాదులు తాలిష్ రాయ్, శ్లోక్ చంద్ర కమిటీలో ఉన్నారు. అంతకుముందు మహిళా రెజ్లర్లపై భూషణ్ లైంగిక హింసకు పాల్పడ్డాడని, ఈ ఫిర్యాదుపై విచారణకు వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషకు రెజ్లర్లు లేఖ రాశారు. దీంతో సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఐఓఏ ఆ ఆరోపణలపై విచారణకు మేరీకోమ్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో అథ్లెట్ల కమిషన్ సభ్యులు అభినవ్ బింద్రా, శివ కేశవన్ కూడా పాల్గొన్నారు.
Read Also: Vande Bharat: ‘వందేభారత్’ ట్రైన్ పై మళ్లీ దాడి.. ఏమైంది జనాలకు
అంతకుముందు, తాను ఏ తప్పూ చేయనప్పుడు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేయాలంటూ భూషణ్ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుట్ర వివరాలన్నీ బయటపెడతానని వెల్లడించారు. విచారణ జరిగేంతవరకు అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాను. కానీ రాజీనామా చేసేదే లేదు అని స్పష్టం చేశారు. అయితే సమయం దాటినా ఆయన మీడియా ముందుకు రాలేదు. కాగా, మీడియా ముందుకు రావొద్దంటూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సూచన మేరకు మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.