Israel Earthquake: ఇజ్రాయెల్‌లోని దక్షిణ నెగెవ్ ఎడారిలో గురువారం ఉదయం 9 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం డిమోనా నగరానికి సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌లోని అత్యంత రహస్య అణు పరిశోధన కేంద్రం (షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధన కేంద్రం) ఉంది. ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో ఆ ప్రాంతంలో ఉండే వాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో అణు పరీక్ష పుకార్లు వ్యాపించాయి.
భూకంప వివరాలు ..
సమయం: ఉదయం 9 గంటలు.
తీవ్రత: రిక్టర్ స్కేలుపై 4.2.
లోతు: 10 కి.మీ (లోతు).
కేంద్రం: డెడ్ సీ రిఫ్ట్ వ్యాలీలో, డిమోనా నుంచి దాదాపు 19 కి.మీ.
ప్రభావం: నెగెవ్, డెడ్ సీ ప్రాంతం, బీర్షెబా, జెరూసలేం లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. కొంతమంది 1-2 సెకన్లు భూమి కంపించినట్లు నివేదించారు. కానీ ఎవరికీ గాయాలు లేదా పెద్దగా నష్టం జరగలేదు.
ఇజ్రాయెల్‌లోని డెడ్ సీ రిఫ్ట్ వ్యాలీలో భూకంపాలు రావడం సర్వసాధారణం. ఇది టెక్టోనిక్ ప్లేట్‌ల జోన్ అని అధికారులు చెబుతున్నారు. కానీ ఈసారి భూకంపం వచ్చిన సమయం, స్థానం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇదే టైంలో ఇజ్రాయెల్‌లో అణు పరీక్షలు జరిగాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి కూడా ఒక కారణం ఉంది. డిమోనాలో ఇజ్రాయెల్‌కు ఒక అణు రియాక్టర్ ఉంది. అక్కడ పని చేస్తున్న నిపుణులకు 1960 నుంచి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ ప్లూటోనియంను ఉత్పత్తి చేస్తోందని సమాచారం. ఇజ్రాయెల్ ఎప్పుడూ NPTలో చేరలేదు. భూకంపం లోతు, సమయం (కొన్ని సెకన్లు) అణు పరీక్షలా కనిపిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.