Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ చేసింది. అమెరికా అధికారుల సూచన మేరకు గతేడాది నవంబర్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే నిందితుడికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా గడ్డపై అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.
ఇప్పటికే ఈ విషయాన్ని అత్యున్నత స్థాయిలో భారత ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేసింది. దీనిపై భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే హత్యకు కుట్ర పన్నిన వారిని బాధ్యులను చేసేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ విషయంలో భారత్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం భారత్ నుంచి జవాబుదారీతనం ఆశిస్తున్నామని పేర్కొంది. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూను హతమార్చేందుకు ఒక హంతకుడికి లక్ష డాలర్లను చెల్లించడానికి నిఖిల్ గుప్తా అంగీకరించాడని అమెరికా ఆరోపిస్తోంది.
Read Also: India fertility rate: ఇండియాలో సంతానోత్పత్తి రేటు 6.2 నుంచి 2కి తగ్గింది.. లాన్సెట్ నివేదిక..
పన్నూ మర్డర్ కుట్ర భారత్, అమెరికాల మధ్య తీవ్ర సమస్యగా దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ బుధవారం వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒకరి ఆదేశానుసారం భారతీయ పౌరుడు అమెరికన్ పౌరుడిని చంపడానికి ప్రయత్నించినట్లు యూఎస్ న్యాయశాఖ ఆరోపించింది. రష్యాలో అలెక్సీ నావల్నీ హత్యకు సంబంధించి యూఎస్ఏ 500 మందికి పైగా వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లే , పన్నూ విషయంలో పరిశీలిస్తున్నారా అని ప్రశ్నించిన సమయంలో లూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై ఇండియాలో అనేక కేసులు నమోదయ్యాయి.