సిద్దార్థ్ శుక్లా.. పునీత్ రాజ్‌కుమార్.. ఏపీ మంత్రి గౌతం రెడ్డి.. తాజాగా షేన్ వార్న్.. వీళ్లే కాదు ఇలా ఎందరో.. ఫిట్‌నెస్ కోసం శ్రమించి… ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల మరణాలు ఏం చెప్తున్నాయి? జిమ్ చేయడం తప్పా? అతిగా శ్రమిస్తే.. హార్ట్ ఎటాక్ తప్పదా? ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదంటారు. మరి వీళ్ల ప్రాణాల మీదకు ఎందుకొచ్చింది? ఫిట్‌గా ఉండేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న సమస్య ఇదే. గుండె పదిలంగా ఉండాలంటే.. ఎక్సర్‌సైజ్, జిమ్, రన్నింగ్.. చేయాలా వద్దా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. సినిమాల్లో డ్యాన్స్‌లు, ఫైట్సే కాదు.. రియల్ లైఫ్‌లోనూ పునీత్ చేసే కసరత్తులు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతం రెడ్డి… ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్. ఎంత బిజీగా ఉన్నా… ఉదయం సాయంత్రం జిమ్ తప్పనిసరి. షేన్ వార్న్.. వయసు మీద పడుతున్నా.. ఫిట్‌నెస్ కోసం పడే తాపత్రయం అంతాఇంతా కాదు. మరి… వీళ్ల గుండెకేమయ్యింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా… చలాకీగా ఉన్న వీరి గుండే పట్టుమని ఆగిపోయిందేంటి..?
అంత ఫిట్‌గా ఉన్నవారి గుండెకే ముప్పు వస్తే… మరి ఎలాంటి జాగ్రత్తలూ పాటించనివారి పరిస్థితి ఏంటి..? ప్రతీ ఒక్కరినీ కలవరపెడుతున్న అంశమిదే. చామంది యువత కూడా ఆర్మీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షకు శిక్షణ పొందే క్రమంలో రన్నింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన వాళ్లను కూడా చూస్తున్నాం. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న యువకులకు యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు నిర్వహిస్తే… వారి రక్తనాళాల్లో ఎలాంటి రక్తపు గడ్డలు, మరెలాంటి అడ్డంకులు కనిపించకపోవచ్చు. అంతా నార్మల్‌గానే ఉంటుంది. అయినా అలాంటివారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్న వారిలో గుండెపోటుకు ఇదే కారణమని చెప్పలేకపోయినా.. ఆ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుంటే బెటర్ అంటున్నారు డాక్టర్లు, జిమ్ ట్రైనర్లు.
గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడితే…. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీన్నే డిఫెక్షన్ అంటుంటారు. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్స్ లేకపోయినా.. కొవ్వుకణాలతో ఏర్పడిన ప్లాక్ పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణమవుతుందంటున్నారు డాక్టర్లు. బాగా ఎక్సర్‌సైజ్ చేసే వారి రక్తనాళాల్లో ఎలాంటి ప్లాక్స్ , బ్లాక్స్ లేకపోయినా అక్కడ అకస్మాత్తుగా రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చంటున్నారు. కొంతమందిలో సహజంగా రక్తంలో క్లాట్స్ ఏర్పడే అవకాశం కూడా ఉందంటున్నారు.
జన్యుపరమైన కారణాలతో.. ఓ వ్యక్తి ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ ఒక్కోసారి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు వైద్యులు. కుటుంబంలో గతంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన దాఖాలాలు ఉంటే.. కుటుంబీకులకు కూడా ఎంత ఫిట్‌గా ఉన్నా ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చంటున్నారు. కోవిడ్ వచ్చిన వారిలో.. కోవిడ్ వచ్చి తగ్గిన కొందరిలో క్లాట్స్ ఏర్పడే తత్వం పెరిగిపోయింది. కొందరికి తమకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతే తెలియకపోవచ్చు. కానీ అనంతర పరిణామంగా రక్తపుగడ్డలు ఏర్పడటం వల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చి అది ఆకస్మిక మరణానికి దారితీస్తోంది.
చిన్నవయసులోనే అంటే.. 21 నుంచి 40 ఏళ్ల వారిలోనూ రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది. దీనికి సరైన కారణం చెప్పలేకపోయినా… కొందరిలో కొలెస్ట్రాల్ నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరి ప్లాక్స్, క్లాట్స్, బ్లాక్స్ మారడం వల్ల కూడా ఆకస్మికంగా గుండెకు రక్త సరఫరా తగ్గి… స్ట్రోక్ రావచ్చంటున్నారు. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లోనే ఎక్కువ. జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ తగ్గడం, హాని చేకూర్చే చెడు కొలెస్ట్రాల్ పెరగడం కూడా యువతలో గుండెపోటుకు కారణమంటున్నారు.
పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా చేరడంతో వచ్చే సెంట్రల్ ఒబెసిటీ, తీవ్రమైన మానసిక ఒత్తిడి తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా హఠాత్తుగా గుండెపోటును తెచ్చేవే. కొంతమందికి గుండెపోటు రాకుండానే ఆకస్మికంగా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నా.. చిన్నవయసులోనే పరీక్షలు చేయిస్తుండాలని.. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు తరచూ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్ కోసం సాధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
రన్నింగ్, ఎక్సర్‌సైజ్, జిమ్ ఫిట్‌నెస్‌కు మేలు చేసేవే అయినా… గుండెమీద భారం పడుతున్నట్లుగా గానీ లేదా తీవ్రమైన ఆయాసానికి గురి చేస్తున్నట్లుగా అనిపించగానే ఆపేయాలంటున్నారు జిమ్, ఫిట్‌నెస్ ట్రైనర్స్. అన్నింటికంటే ముఖ్యంగా చేసే ఎక్సర్‌సైజ్ తీవ్రంగా ఉండకుండా.. శ్రమ కలిగించకుండా చూసుకోవాలంటున్నారు.