ఆసియా కప్ 2025 ముగిసిందని క్రికెట్ అభిమానులు చింతించాల్సిన అవసరం లేదు. నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం అవుతోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. సొంతగడ్డపై మెగా క్రికెట్ టోర్నీ జరుగుతుండడం, ఇటీవల ప్రదర్శన మెరుగ్గా ఉండడంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవని భారత జట్టు.. ఈసారైనా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? అన్నది చూడాలి.
శ్రీలంక మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్మృతి మంధాన, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలతో బౌలింగ్ బాగానే ఉంది. సమిష్టిగా రాణిస్తే భారత జట్టుకు వన్డే ప్రపంచకప్‌లో ఎదురుండదు. మంచి భాగస్వామ్యాలు నమోదైతే భారీ స్కోర్ చేయొచ్చు. మరోవైపు శ్రీలంక కూడా అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. బ్యాటర్లు విష్మి, హర్షిత.. కెప్టెన్ చమరి ఆటపట్టు, ఆల్‌రౌండర్ కవిష్క, బౌలర్లు సుగంధిక, ఇనోకాలపై అంచనాలు ఉన్నాయి.
బర్సపారా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బౌండరీల లెంత్ తక్కువగా ఉండడం బ్యాటర్లకు కలిసొచ్చే అంశం. అయితే ఇక్కడ బంతి బౌన్స్ కూడా అవుతుంది. పేసర్లకు ఇది కలిసిరానుంది. ఈరోజు బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి సమరం జరిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ గువాహటిలో ఆరంభం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రిచా ఘోష్ (కీపర్), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హార్లిన్ డియోల్, ప్రతీకా రావల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రాధా యాదవ్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి.
శ్రీలంక: ఎ సంజీవని (కీపర్), హెచ్ మదవి, ఎన్ డి సిల్వా, హెచ్ పెరెరా, విష్మి రాజపక్ష, సి అటపట్టు (కెప్టెన్), డబ్ల్యుకె దిల్హరి, ఐ రణవీర, ఎస్ కుమారి, మల్కీ మదార, ఐ దులాని.