వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లను గెలిచిన చరిత్ర దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు లేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఓ కారణం అయితే.. దురదృష్టం వెంటాడడం మరో కారణంగా ప్రొటీస్ ఇన్నాళ్లు టైటిల్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్ 2024లో ఫైనల్స్‌కు చేరినా.. భారత్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. మహిళల జట్టు కూడా తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తయింది. 2023 తుది పోరులో ఆస్ట్రేలియాకు ప్రొటీస్ తలవంచింది. దాంతో వరుసగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ దక్షిణాఫ్రికా అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌పై చివరి బంతి కాగానే.. ప్రొటీస్ అమ్మాయిలు దుఃఖంలో మునిగిపోయారు. పురుషుల, మహిళల క్రికెట్లో ఇప్పటివరకూ ప్రపంచకప్‌ను అందుకోలేని దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతూనే ఉంది.
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ అమ్మాయిల చేతిలో 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అమేలియా కెర్ (43), బ్రూక్ హాలీడే (38), సుజీ బేట్స్ (32) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలబా (2/31) ఆకట్టుకుంది. ఛేదనలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 126 పరుగులకే పరిమితమైంది. లారా వోల్వార్ట్ (33; 27 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. అమేలియా (3/24), రోజ్‌మేరీ (3/25) సత్తాచాటారు.