దేశ రాజధాని ఢిల్లీలోని పితంపుర మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కదులుతున్న మెట్రో ముందు దూకింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మెట్రో రెడ్‌లైన్‌లో కూడా కొంతసేపు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెడ్ లైన్ మెట్రో ఢిల్లీలోని రిథాలా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ (కొత్త బస్టాండ్) వరకు నడుస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. 53 ఏళ్ల మహిళ మధ్యాహ్నం 2.23 గంటలకు పితంపుర మెట్రో స్టేషన్‌లో రైలు ముందు దూకింది. స్థానికులు మెట్రో పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Kejriwal: హర్యానాలో ఆప్ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదు
తీవ్రంగా గాయపడిన మహిళను మెట్రో సిబ్బంది రోహిణిలోని బీఎస్‌ఏ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో మహిళ కుడి చేయి తెగిపోయింది. మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అధికారి తెలిపారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రెడ్‌లైన్‌లోని పితాంపుర మెట్రో స్టేషన్‌లో రైలు పట్టాలపైకి మహిళ దూకడం వల్ల 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యమైందని, ఆ తర్వాత మరోసారి మెట్రో సర్వీసును పునరుద్ధరించామని డీఎంఆర్‌సీ సీనియర్ అధికారి తెలిపారు.