Wipro: టెక్ దిగ్గజం విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు మండిపోతున్నాయి. ఆదాయం చాలక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇక వేతన జీవులు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది టెక్ దిగ్గజం విప్రో. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. డిసెంబర్ ఒకటిన విప్రో ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. అయితే, అధిక జీతాలు తీసుకుంటున్న వాళ్లకు ఈ ఏడాది పెంపులు ఉండబోవంటూ అంతర్గత ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపింది విప్రో. తక్కువ జీతాలు పొందుతున్న వాళ్లకు మినహాయింపు ఇచ్చింది. వాళ్లకు యథావిధిగా డిసెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెరగనున్నాయి.
Read Also: Israel-Hamas War: వెస్ట్ బ్యాంక్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి..
సాధారణంగా టాప్ పెర్ఫార్మర్లకు జీతాల్లో అధిక పెంపు ఇస్తూ వస్తుంది విప్రో. అయితే, ఈ సారి సెలక్టీవ్ మెరిట్ సాలరీ ఇంక్రీజ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం తక్కువ వేతనం పొందుతున్న వాళ్లలో అర్హులకు మాత్రమే జీతాల పెంపు ఉంటుంది. అందువల్ల.. అధిక వేతనాలు పొందుతున్న వాళ్లు అద్భుతమైన పనితీరు కనబర్చినా.. జీతాల పెంపు మాత్రం ఉండబోదని స్పష్టం చేసింది విప్రో యాజమాన్యం. గత సెప్టెంబర్ 30 నాటికి విప్రోలో 2 లక్షల 44 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుల్లో నాల్గో స్థానంలో ఉంది ఈ సంస్థ. అయితే, ప్రస్తుతం సంస్థ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వైపు క్లయింట్లు ఖర్చు తగ్గించుకుంటున్నారు. మరోవైపు.. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అందరికీ జీతాలు పెంచి భారం పెంచుకోవడం సరికాదనే ఆలోచనలో విప్రో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.