NTV Telugu Site icon

High Court: మగ స్నేహితుడితో భార్య అసభ్యకరమైన చాటింగ్.. భర్త సహించలేడన్న హైకోర్ట్..

High Court

High Court

High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్తపై భార్య క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది.

సదరు మహిళ తన మగ స్నేహితుడితో తన లైంగిక జీవితం గురించి చాట్ చేస్తున్నట్లు కోర్టు గమనించింది. అలాంటి ప్రవర్తన గురించి ఏ భర్త కూడా సహించడని కోర్టు పేర్కొంది. ‘‘తన భార్య మొబైల్ ద్వారా ఈ రకమైన అసభ్యకరమైన సంభాషణలో ఉండటం ఏ భర్త సహించడు’’ అని చెప్పింది.

Read Also: Breaking News: పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్..

‘‘వివాహం తర్వాత, భార్యాభర్తలు ఇద్దరూ మొబైల్, చాటింగ్ మరియు ఇతర మార్గాల ద్వారా స్నేహితులతో సంభాషించే స్వేచ్ఛను కలిగి ఉంటారు, కానీ సంభాషణ స్థాయి మర్యాదగా, గౌరవంగా ఉండాలి, ముఖ్యంగా ఆపోజిట్ జెండర్ చెందిన వారితో ఉన్నప్పుడు అభ్యంతరకరంగా ఉండొద్దు’’ అని కోర్టు చెప్పింది. ఒక జీవిత భాగస్వామిపై మరొకరికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది నిస్సందేహంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

ఈ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. భర్త ఫిర్యాదు ప్రకారం, ఆ మహిళ వివాహం తర్వాత తన ‘‘పాత ప్రేమికుల’’తో మొబైల్‌లో మాట్లాడేది. వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని ఆమె భర్త ఆరోపించాడు. దీంతో తనకు సంబంధం లేదని భార్య, భర్త వాదనల్ని తోసిపుచ్చింది. తన భర్త తన మొబైల్‌ని హ్యాక్ చేసి, తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేశాలను ఇద్దరు పురుషులకు పంపాడని కూడా ఆమె పేర్కొంది. తన భర్త చర్యలు తన గోప్యతా హక్కుని ఉల్లంఘించాయని ఆ మహిళ ఆరోపించింది. ఆమె అతడిపై రూ.25 లక్షల కట్నం డిమాండ్ ఆరోపణలు చేసింది. అయితే, భర్త ఆరోపణల్లో అర్హత ఉందని కోర్టు గుర్తించింది. మహిళ తండ్రి కూడా తన కుమార్తె తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడేదని సాక్ష్యమిచ్చాడు. దీంతో దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకుల్ని, హైకోర్టు సమర్థించింది.