Vizag Constable Case: విశాఖలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కానిస్టేబుల్ హత్య కేసును సీపీ స్వయంగా పర్యవేక్షించారు. రమేశ్ మృతి కేసుపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. రమేష్ భార్య శివాని మొబైల్‌లోని వీడియోస్, వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు. ఇప్పటికే భార్య శివాని, ప్రియుడు రామారావు, స్నేహితుడు నీలాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర కమిషనర్ సీపీ త్రివిక్రమ వర్మ మీడియాకు వివరించారు.
Also Read: Vizag Constable Case: ఆమె అందమే అతనికి శాపం.. ప్రియుడితో కలిసి కానిస్టేబుల్‌ని చంపిన భార్య
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రమేష్‌ను భార్య శివాని హత్య చేయించిందని ఆయన తెలిపారు. మూడు రోజులు క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని భార్య ఫిర్యాదు చేసిందని.. ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టంకు పంపించినట్లు ఆయన తెలిపారు. అందులో ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలిందని.. దీనితో కేసును లోతుగా విచారించామని సీపీ వెల్లడించారు. భార్యే ప్రియుడి కోసం భర్తను చంపించిందని ఆయన చెప్పారు. మూడు రోజుల క్రితం మద్యం తాగించి వీడియో తీసిందన్నారు. ఆ తరువాత రమేష్ పడుకున్న తరువాత ప్రియుడు రామారావు బయట ఉన్నాడని.. రామారావు స్నేహితుడు దిండితో నొక్కి చంపాడని సీపీ వివరించారు. ఆ సమయంలో రమేష్ కదలకుండా భార్య కాళ్ళు పట్టుకుందని.. రమేష్‌ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సీపీ పేర్కొన్నారు.
వీరి ప్రేమ వ్యవహరంపై గతంలో అనేక గొడవలు జరిగాయని.. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్ళిపోవాలని రమేష్ కోరాడని సీపీ చెప్పారు. పిల్లలు, ప్రియుడు ఇద్దరు కావాలని అడ్డుగా ఉన్న రమేష్‌ను చంపిందని ఆయన తెలిపారు. ప్రియుడు రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చిందని.. శివానికి నేర స్వభావం ఉందని సీపీ చెప్పారు. ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవలు ఉన్నాయన్నారు. ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను పోలీసులు అరెస్ట్ చేశారు.