Varahi Yatra: ఉత్తరాంధ్రలో బలోపేతం కావడం.. ప్రజా సమస్యలపై పోరాటం లక్ష్యంగా వారాహి విజయయాత్రకు జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధం అయ్యారు. వారాహి మూడో విడత షెడ్యూల్ ప్రకటించిన జనసేన.. గతంకంటే మరింత పక్కాగా టూర్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పవన్ కల్యాణ్ విశాఖలోనే మకాం వేయనున్నారు. జనసేనకు అన్ని విధాలుగా ఆదరణ లభిస్తున్న స్టీల్ సిటీపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీకి లభించిన ఆదరణ.. జనసేన పోరాటాలకు వచ్చిన మద్దతును అనుకూలంగా మలుచుకోవడం ద్వారా ఇంకా బలోపేతం కావాలనేది ఆలోచన. ఈ దిశగా తొమ్మిది రోజుల విజయయాత్ర అత్యంత కీలకమైనదిగా భావిస్తోంది జనసేన. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయని మొదటి నుంచి పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు పెడతామంటోంది జనసేన. మంత్రి అమర్నాథ్, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పేర్లను ప్రస్తావిస్తూ జమ్మాదులుపాలెం భూములపై చేస్తున్న ఆరోపణలు, విశాఖ నడిబొడ్డున వందల కోట్ల విలువైన దసపల్లా ల్యాండ్స్ చేతులు మారడాన్ని జనసేన ప్రముఖంగా ప్రస్తావించే వీలుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్ కార్యాచరణను లీడ్ తీసుకునే దిశగా జనసేన ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉక్కు పరిరక్షణపై తమ వైఖరిని స్పష్టం చేయడంతోపాటు బహిరంగ సభను నిర్వహించింది. సుమారు లక్ష కుటుంబాలతో ముడిపడ్డ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం 900 రోజులు దాటింది. ఈ ఉద్యమంపై పవన్ ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారనే ఆసక్తి కనిపిస్తోంది. షెడ్యూల్‌లో భాగంగా జనవాణి నిర్వహించడం ద్వారా విశాఖ వాసుల సమస్యలను తెలుసుకునేందుకు పవన్ ప్రయత్నించనున్నారు. ఒకసారి జనవాణి కోసం చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా పోలీసుల అనుమతి లభించలేదు. అప్పట్లో వాయిదా పడ్డ కార్యక్రమాన్ని వారాహి యాత్రలో జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది జనసేన. వారాహి విజయోత్సవ యాత్రలో రెండు బహిరంగ సభలు, పెందుర్తిలో వాలంటీర్ హత్య చేసిన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. అలాగే విశాఖలో సమస్యలున్న ప్రాంతాలను వెళ్లి ప్రత్యక్షంగా సందర్శిస్తారు పవన్. ఋషికొండ నిర్మాణాల దగ్గరకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పొలిటికల్ హీట్ మరింత రాజుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోలీసులు అనుమతి ఎంత వరకు లభిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.