NTV Telugu Site icon

Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?

Rahul Gandhi

Rahul Gandhi

మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు. కుల గణనల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ… ఇది కేవలం జనాభా గణన మాత్రమే కాదని, విధాన రూపకల్పనకు ప్రాతిపదిక అన్నారు. “90 శాతం మంది ప్రజలు వ్యవస్థలో భాగం కాలేదు. వీరికి నైపుణ్యాలు, ప్రతిభ, విజ్ఞానం ఉన్నా వ్యవస్థతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందుకే కుల గణన కోరుతున్నాం. కుల గణన తర్వాత ఓబీసీ సెక్షన్‌ ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మాకు వివిధ సంఘాల జాబితా కావాలి. మనకు కుల గణన అనేది కేవలం జనాభా గణన మాత్రమే కాదు. విధాన రూపకల్పనకు ఆధారం. కేవలం కుల గణన చేస్తే సరిపోదు.. దేశంలో సంపద ఎలా పంపిణీ అవుతుందో అర్థం చేసుకోవాలి.” అని ఆయన ఉద్ఘాటించారు. బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమన్నారు.

READ MORE:Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ పథకంపై ప్రధాని మోడీ హర్షం..

మిస్ ఇండియా జాబితాను పరిశీలించగా అందులో దళిత, గిరిజన, ఓబీసీ మహిళ లేరన్న విషయం స్పష్టమైందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికీ మీడియా డ్యాన్స్, మ్యూజిక్, క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుంది కానీ రైతులు, కూలీల గురించి మాట్లాడదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులాలు, ఉపకులాలు, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను లెక్కించేందుకు దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచినట్లు చెప్పారు.