సొంత నియోజకవర్గమైన పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలను మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులతో జగన్ మాట్లాడనున్నారు.
ఇవాళ పెనుకొండ జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు మంత్రి సవిత భూమి పూజ చేయనున్నారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పాలకమండలి సమావేశంలో పాల్గొంటారు.
ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పాలకమండలి ఆమోదించనుంది.
ఈరోజు ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనుంది.
నేడు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ విశాఖలో పర్యటించనున్నారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరించనున్నారు.
నేడు బలభద్రపురానికి విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్య బృందం వెళ్లనుంది. గ్రామంలోని క్యాన్సర్ అనుమానితులకు వైద్య పరీక్షలు, గ్రామస్తులకు వైద్య బృందం అవగాహన కల్పించనుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటల యుద్ధంతో సభ రసవత్తరంగా సాగనుంది.
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. లక్నోతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఈరోజు పంజాగుట్ట పోలీసుల ఎదుట నటి శ్యామల హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో శ్యామలపై కేసు నమోదైంది.