ఇండియా కూటమిలో విభేదాలు మరింత ముదురుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జేడీయూ బయటకు వచ్చేసి ఎన్డీఏతో జత కట్టింది. తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిని ఆందోళనకు గురయ్యేలా చేశాయి. ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు కావాలంటే సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు విరమించుకోవాలని సూచించారు. ఇక సీట్ల సర్దుబాటు చర్చల్లో కాంగ్రెస్‌కు తాము రెండు సీట్లు ఇవ్వాలని చూస్తే ఆ ప్రతిపాదనను తిరస్కరించారని.. ఇప్పుడైతే ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని మమత తేల్చి చెప్పారు. దీంతో ఇండియా కూటమిలోని విభేదాలు చూస్తుంటే చీలిక దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
సీట్ల పంపకం విషయంలో ఇండియా కూటమిలో చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఆప్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించింది. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని పేర్కొంది. ఇక యూపీలో అయితే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ 16 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇలా కూటమిలోని సభ్యులంతా ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితులను బట్టి ఎన్నికల దాకా ఈ కూటమి ఉంటుందో లేదో అర్థంకాని దుస్థితి ఏర్పడింది. కూటమిలోని విభేదాలను మాత్రం బీజేపీకి క్యాష్ చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటుంది.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బెంగాల్‌లో కొనసాగుతోంది. తాజాగా మమత చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.