జూన్ రెండవ వారం నడుస్తోంది. అయినా చినుకు జాడలేదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రుతుపవనాలు కేరళను తాకేశాయని, మనకు ఈసారి ముందే వానలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అయిదారు డిగ్రీలు అదనంగా పెరగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు.
మే 29న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి ఈ నెల 8కల్లా ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అంచనా వేయగా.. అవి తప్పాయి. రుతుపవనాలు చురుకుగా ముందుకు కదలాలంటే మాత్రం మరికొద్దికాలం ఆగక తప్పదంటోంది వాతావరణ శాఖ. తెలంగాణకు రుతుపవనాలు రావాలంటే ముందుగా కర్ణాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడాలి. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి.
తెలంగాణలోనే అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో అధిక వేడి, ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఈ పరిస్థితి కొనసాగుతోంది. జూన్ మూడవ వారంలో చినుకులు పడే అవకాశం వుంది. సాధారణంగా మృగశిర కార్తె ప్రారంభం నాడు వానలు పడాలి. కానీ అవి పడలేదు. గతంలో హైదరాబాద్ లో చేపమందు కోసం వచ్చు ఉబ్బసం రోగులు వానల్లో తడస్తూ మందు తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అటు వానల జాడ లేదు, ఈసారి చేపమందు పంపిణీ లేదు.
