గుత్త సుఖేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. ఈయనేమో కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. ఇద్దరూ టీఆర్‌ఎస్ నాయకులే. కానీ.. ఒకరంటే ఒకరికి పడదు. చాలా గ్యాప్ ఉందనేది గులాబీ శ్రేణులు చెప్పేమాట. ఒకరిపేరు మరొకరు వినడానికి.. పలకడానికి.. చివరకు ఎదురుపడటానికీ ఇష్టపడరని చెబుతారు. ఆ మధ్య నల్లగొండ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయానికి మండలి ఛైర్మన్ గుత్తా వెళ్తే.. ఆలయ ఈవో, అర్చకులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదట. అదంతా ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అక్కడ జరిగిన పరిణామాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారట గుత్తా. విషయం తెలిసి ఈ ఆధిపత్యపోరులో నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారట ఉద్యోగులు.
ఎవరైనా పార్టీ కార్యకర్తలు గుత్తా ఇంటికి వెళ్లారని తెలిస్తే.. తమ ఇంటికి రావొద్దని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి. దీంతో గుత్తా దగ్గరకు వెళ్లడం మానుకున్నారట కొందరు శ్రేణులు. ఈ మూడేళ్ల కాలంలో జిల్లా స్థాయి కార్యక్రమాలకో.. పార్టీ ముఖ్యనేతల మీటింగ్స్‌కో తప్ప గుత్తా, భూపాల్‌రెడ్డిలు కలిసి వేదిక పంచుకున్న దాఖలాలు లేవు. దీంతో లోకల్‌గా ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ఎవరిని ఆహ్వానిస్తే.. ఇంకెవరికి కోపం వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారట ద్వితీయశ్రేణి నాయకులు.
ప్రొటోకాల్ పాటించకుండా ఉద్దేశపూర్వంగానే అవమానిస్తున్నారని గుత్తా మనస్తాపం చెందుతున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అని పార్టీ స్పష్టం చేసిన విషయాన్ని మర్చిపోవద్దని భుపాల్‌రెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారట. వాస్తవానికి దశాబ్దాల క్రితం గుత్తా, భూపాల్‌రెడ్డి ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగినవారే. తర్వాతే గ్యాప్ వచ్చేసింది. ఎడముఖం పెడముఖంగా మారిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నమ్ముకొన్న కొందరు నాయకులు ఇద్దరితో సఖ్యంగా ఉంటున్నారట.
ఇద్దరు నేతల మధ్య వచ్చిన గ్యాప్ వల్ల నల్లగొండ టీఆర్ఎస్‌కు కలుగుతున్న లాభనష్టాలపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారట. ఇప్పటికే గ్రౌండ్ నుంచి పక్కా సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సమస్య శ్రుతి మించకుండా ఇద్దరి మధ్య ఎప్పుడు సయోధ్య కుదుర్చుతారోనని ఎదురు చూస్తున్నారట కార్యకర్తలు. మరి.. నల్లగొండ టీఆర్ఎస్‌లో నువ్వా నేనా అని సాగుతున్న ఈ ఆధిపత్యపోరుకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.