ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుంది.
అలాగే రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా. బి ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని పేర్కొంది. బయటకు వెళ్ళేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇటు తిరుపతిలో వర్షం పడింది. తిరుమలలోనూ భారీ వర్షం కురవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులుతో పడుతున్న వర్షంతో వాతావరణం చల్లబడింది. పిడుగులు పడుతూ వుండడంతో తిరుపతిలో పలు ప్రాంతాలలో విద్యుత్త్ సరఫరా నిలిచిపోయింది. అనంతలో భారీ వర్షం పడుతోంది. ఇటు హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాత్రి నుంచి కురిసిన వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.