Andhrapradesh: దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తాజాగా, మరో రెండు రోజులు ఎండలు మండిపోతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 264 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 42 మండలాల్లో తీవ్రవడగాల్పులు,203 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Tragedy: విషాదం.. అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
శుక్రవారం కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8 డిగ్రీలు, విజయనగరం జిల్లా కంతకపల్లె, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 46.3 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో 46.1 డిగ్రీలు, మన్యం జిల్లా కురుపాం, అప్పయ్యపేటలో 45.6 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 45.3 డిగ్రీలు, కోనసీమ జిల్లా మండపేట,ఈతకోటలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 370 మండలాల్లో తీవ్రవడగాల్పులు,132 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.