BBC Documentary: గత వారంలో మూడు రోజుల పాటు ఢిల్లీ, ముంబైలో గల బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ సర్వే కార్యకలాపాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బీబీసీని, దాని సంపాదకీయ స్వేచ్ఛను గట్టిగా సమర్థించింది. విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి కార్యాలయం (FCDO) జూనియర్ మంత్రి మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేవనెత్తిన అత్యవసర ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ.. కొనసాగుతున్న దర్యాప్తుపై, ఐటీ శాఖ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పుడే ఏం మాట్లాడలేమని పేర్కొన్నారు. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం బలమైన ప్రజాస్వామ్యాల ముఖ్యమైన అంశాలని ఆయన పార్లమెంట్‌లో అన్నారు.
విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి కార్యాలయం పార్లమెంటరీ సెక్రటరీ డేవిడ్ రూట్లీ భారత్‌తో లోతైన సంబంధాలను సూచించారు. అంటే దీనర్థం యూకే అనేక రకాల సమస్యలను నిర్మాణాత్మక పద్ధతిలో చర్చిస్తుందన్నారు. అలా అంటూనే ఆయన తాము బీబీసీ కోసం నిలబడతామని, బీబీసీకి నిధులు సమకూరుస్తామన్నారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ చాలా ముఖ్యమైనదిగా తాము భావిస్తున్నామన్నారు. బీబీసీకి ఆ సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. బీబీసీ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలను కూడా విమర్శిస్తుందని, దానికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఆ స్వేచ్చ చాలా కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు, భారత ప్రభుత్వంతో సహా స్వేచ్ఛకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియజేయాలన్నారు.
Earthquake: త్వరలో హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ భూకంపాలకు అవకాశం..
భారత్‌లో ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 14న దాడులను ప్రారంభించగా.. మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 16న న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై సర్వేగా వర్ణించబడిందని మంత్రి తెలిపారు. బీబీసీ ఆపరేషనల్‌గా, ఎడిటోరియల్‌గా స్వతంత్రంగా ఉందని విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి కార్యాలయం పేర్కొంది. బీబీసీ నాలుగు భారతీయ భాషలతో సహా 12 భాషలలో సేవలను అందిస్తోంది.
ప్రతిపక్ష ఎంపీలు భారత ప్రభుత్వంతో చర్చలు గురించి అడగగా.. మంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. భారత్‌తో మనకున్న విస్తృత, లోతైన సంబంధాల కారణంగానే తాము అనేక సమస్యలపై చర్చించగలుగుతున్నామని మంత్రి వెల్లడించారు. ఉత్తర ఐర్లాండ్ ఎంపీ జిమ్ షానన్ ఈ అత్యవసర ప్రశ్నను లేవనెత్తారు. బీబీసీ డాక్యుమెంటరీ గురించి ప్రశ్నించారు. ఈ చర్యను దేశ నాయకుడి గురించి పొగడ్త లేని డాక్యుమెంటరీని విడుదల చేసిన తరువాత ఉద్దేశపూర్వక బెదిరింపు చర్య అని ఐటీ సర్వే గురించి పేర్కొన్నాడు. ఈ సమస్యపై ప్రకటన చేయడంలో విఫలమైనందుకు యూకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయనతో పాటు మరికొందరు ప్రతిపక్ష ఎంపీలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. భారత్‌లో అధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలపై దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి కాదని ఇతర లేబర్ పార్టీ ఎంపీలు ఎత్తి చూపారు. ఇదిలా ఉండగా.. బీబీసీపై కొనసాగుతున్న ఆదాయపు పన్ను శాఖ సర్వేపై వ్యాఖ్యానించడానికి మంత్రి నిరాకరించారు. బీబీసీ సంస్థ యూనిట్లు వెల్లడించిన ఆదాయం, లాభాలు భారతదేశంలో కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సర్వే తర్వాత ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.