తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారన్న ఆరోపణల నేపథ్యంలో న్యూయార్క్ కోర్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అమెరికా చరిత్రలో నేర విచారణకు హాజరైన మొదటి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం విశేషం. అయితే విచారణ సందర్భంగా ట్రంప్ నిద్రపోతున్నట్లు.. కళ్ళు తెరవడానికి కష్టపడుతున్నట్లు కనిపించారు. దీంతో న్యాయస్థానంలో ట్రంప్ నిద్రపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. విచారణ సమయంలో కుర్చీలో చేతులు కట్టుకుని కూర్చున్న ట్రంప్.. మెల్లగా తన కళ్లు మూస్తూ మధ్యలో ఆవలించారని వెల్లడించాయి. నిద్రను నియంత్రించేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపాయి. విచారణ వేళ కోర్టు గదిలో కూర్చునేందుకు అనుమతి తీసుకున్న కొందరు జర్నలిస్టులు ఇదంతా గమనించినట్లుగా తెలుస్తోంది.
గతంలోనూ ట్రంప్ ఇలానే నిద్రపోతున్నట్లు కనిపించిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి మాత్రం ట్రంప్ న్యాయవాది అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. వాటిని ఆయన అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిద్ర కమ్ముకురావడంతో కాసేపు తన తలను కిందకు దించినట్లు పేర్కొన్నాయి.
అయితే కోర్టు రూమ్‌లో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన బృందం ఖండించింది. ఇది వంద శాతం ఫేక్‌న్యూస్ అని కొట్టిపారేశారు. ఆయన అలా చేయలేదని వివరణ ఇచ్చింది. మీడియా చేస్తున్న ప్రచారం అసత్యమని కొట్టిపారేసింది. కొందరు నెటిజన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కామెంట్లు పోస్టు చేశారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.