ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరానికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్ నగరాలతో పాటు విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్‌టోక్, ఇటానగర్ కూడా టాప్‌లో నిలిచాయి. ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపుర్, ఫరీదాబాద్, కోల్‌కతా, శ్రీనగర్‌లు జాబితాలో దిగువన ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా ఈ జాబితా వెల్లడైంది.
NARI 2025 నిర్వహించిన సర్వేలో స్మార్ట్ సిటీ విశాఖ మొదటి స్థానం కైవసం చేసుకుంది. మహిళల విషయంలో జాతీయ భద్రతా స్కోరు 65 శాతంగా ఉంది. షీ టీమ్స్, డ్రోన్ సర్వేలెన్సు ద్వారా నిఘా, శక్తి యాప్, బీచ్ పాట్రోలింగ్‌తో పాటు నవ సమాజ నిర్మాణం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి అవేర్నెస్ కల్పించారు. కాలేజీల వద్ద, స్కూలు వద్ద ఈవిటీజర్ల ఆగడాలకు సీపీ చెక్ పెట్టారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో మెరుగైన భద్రతా నెట్‌వర్క్ పెంచారు. విశాఖ నగరానికి అరుదైన ఘనత దక్కడంతో జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mohammed Shami: టీమిండియాలో చోటుపై ఎలాంటి ఆశలూ లేవు.. షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాకపోకల విషయంలో మహిళా భద్రత ఎంతో కీలకమని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగానే కాకుండా డిజిటల్ పరంగానూ భద్రత అవసరమన్నారు. మహిళల భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు, హెల్ప్‌లైన్‌ల వినియోగంకు మద్దతు ఇవ్వడం వంటి చర్యల ద్వారా దీనికి సహకరించాలని ప్రజలకు విజయ రహత్కర్ పిలుపునిచ్చారు.