Avinash Reddy Mother Health Condition: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది.. ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా.. హాజరుకాలేనంటూ సీబీఐకి సమాచారం ఇచ్చారు అవినాష్‌రెడ్డి.. అయితే, సీబీఐ అధికారులు కర్నూలు చేరుకోవడం.. అవినాష్‌రెడ్డి తల్లి చికిత్స పొందుతోన్న ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించడంతో.. ఏం జరుగుతోంది? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. కాసేపటి క్రితమే వైఎస్ శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై తాజా బులిటెన్ విడుదల చేశారు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు.. ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని.. ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.. ఆమె మా వైద్యుల బృందం పర్యవేక్షణలో సీసీయూలో ఉన్నారు. రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని, ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉన్నారని వెల్లడించారు.. బీపీ తక్కువగా ఉన్నందున ఆమెకు మరికొన్ని రోజులు ఐసీయూలో ఉంచాల్సి ఉంటుందని బులెటిన్‌లో పేర్కొన్నారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. కాగా, మరోవైపు, ఇప్పటికే కర్నూలు చేరుకున్నారు సీబీఐ అధికారులు.. జిల్లా ఎస్పీతో పలు మార్లు సమావేశం అయ్యారు.. ఇక, ఆస్పత్రి చుట్టూ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ శ్రేణులు మోహరించి ఉన్నాయి.. దీంతో, ఆస్పత్రి దగ్గర ఏం జరుగుతోంది.. మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు ఇస్తుందా? లేదా ఇంకా ఏదైనా చర్యకు దిగుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.