Virat Kohli Have a 100 percent place in India’s T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఆ టోర్నీ తర్వాత భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను బీసీసీఐ సెలెక్టర్లు టీ20లకు ఎంపిక చేయడం లేదు. ఈ ఇద్దరు టెస్ట్, వన్డేకు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన విండీస్ టీ20 సిరీస్‌లో ఆడలేదు. దీంతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొట్టిపారేశారు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కచ్చితంగా ఆడతాడని అన్నారు. కోహ్లీ అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో అవసరం అని తెలిపారు.
ది క్రికెట్ బసు యూట్యూబ్ ఛానెల్‌లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ… ‘100 శాతం టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ ఆడతాడు. అతడు గత టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటాడు. కొన్ని క్లోజ్ గేమ్స్ జరిగాయి. పాకిస్తాన్ లాంటి మ్యాచ్‌లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచకప్ అంటే మెగా టోర్నీ అని అందరికి తెలుసు. ఎమోషన్స్ అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఆ పరిస్థితులను ఎదుర్కొన్న ఆటగాళ్లు జట్టుకు కావాలి. స్ట్రైక్ రేట్ పక్కనపెడితే.. పెద్ద మ్యాచ్‌ల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండాలి. కోహ్లీ అలాంటి ఆటగాడు. గత పాకిస్థాన్ మ్యాచ్‌లో అలాంటి స్ఫూర్తిని కోహ్లీ ప్రదర్శించాడు’ అని అన్నారు.
‘2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ కూడా రసవత్తరంగా సాగింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గొప్పగా ఆడాడు. ప్రతి ఒక్కరు వారి స్వంత స్టైల్‌లో పరుగులు చేస్తారు. సిక్సులు కొట్టడం తప్పనిసరి ఏం కాదు. మ్యాచ్‌లు గెలవడానికి హిట్టర్లు అవసరం లేదు. అలా అనుకుంటే వెస్టిండీస్ అన్ని ప్రపంచకప్‌లను గెలుచుకునేది. కోహ్లీ ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా 100 రన్స్ చేయగలడు. ఒత్తిడిలో ఆడే ఆటగాళ్లు లేకుంటే జట్టు ఇబ్బందిలో పడుతుంది’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నారు.
Also Read: IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
విరాట్ కోహ్లీ అనుభవం, నైపుణ్యం మరియు ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం అతడిని 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమయ్యేలా చేస్తాయని సంజయ్ బంగర్ చెప్పారు. జూన్ 4 నుంచి 30 వరకు వెస్టిండీస్ మరియు యుఎస్‌లలో టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఇక కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నెల చివరలో ఆరంభం అయ్యే ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నాడు.