Virat Kohli Slams Daily Newspaper for publishing fake news about building a cricket pitch: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మలు 2022లో ముంబైకి సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో సుమారు 8 ఎకరాల భూమిని రూ. 19.24 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. విరుష్క జోడి ఈ స్థలంలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన ఇల్లు (ఫామ్‌హౌస్) నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ మజుందార్ బ్రావో పర్యవేక్షణలో నిర్మితమవుతున్న పనులను కోహ్లీ-అనుష్క ఇటీవల పరిశీలించారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
అలీబాగ్ ప్రాంతంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారని రెండు రోజుల క్రితం అన్ని జాతీయ పత్రికలు తమ కథనాల్లో రాశాయి. అయితే ఓ జాతీయ పత్రిక మాత్రం కోహ్లీ క్రికెట్ పిచ్‌ను కూడా కొత్త ఇంటి ఆవరణంలో నిర్మించాలనుకుంటున్నాడని ఓ కథనాన్ని ప్రచురించింది. దాన్ని చదివిన కోహ్లీ షాక్‌కు గురయ్యాడు. ఆపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందులో ఏ నిజం లేదని స్పష్టం చేశాడు. ‘నేను చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదువుతున్న వార్తా పత్రిక కూడా ఫేక్ న్యూస్ రాస్తోంది’ అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు.
తప్పుడు వార్తకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జత చేశాడు. ప్రస్తుతం ఈ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి కోహ్లీ క్రికెట్ పిచ్‌ను నిర్మించుకోవడంలేదని స్పష్టం అయింది. కోహ్లీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనకు సంబందించిన వార్తపై కూడా స్పందించాడు. ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు వసూలు చేస్తున్నా అని వచ్చిన వార్తలో నిజం లేదన్నాడు.
Also Read: Realme 11 5G Launch: ఆగష్టు 23న రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 వంటి మెగా టోర్నీల నేపథ్యంలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయంను పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నాడు. ఆగస్టు 30 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ 2023లో కోహ్లీ ఆడతాడు. కోహ్లీపై భారత జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ఆసియాకప్ 2023, ప్రపంచకప్ 2023 లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.