క్రికెట్‌లో కన్నా వింబుల్డన్‌లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో.. వింబుల్డన్ ప్రతి మ్యాచ్‌లోనూ అంతే ఉంటుందన్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం గ్రేట్ అని విరాట్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2025 టోర్నీ జరుగుతోంది. లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. సోమవారం జకోవిచ్, మినార్ మధ్య మ్యాచ్‌ను సతీసమేతంగా వీక్షించాడు.
మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ క్రికెట్ కన్నా.. వింబుల్డన్ ఆడటమే కష్టమని చెప్పాడు. ‘క్రికెట్‌లో ఆటగాళ్లకు దూరంగా ఫాన్స్ ఉంటారు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు మాత్రమే ప్రేక్షకులకు దగ్గరగా ఉంటారు. వింబుల్డన్‌లో మాత్రం ఫాన్స్ చాలా దగ్గరగా ఉంటారు. ఇది ఆటగాళ్లకు ఒత్తిడిని పెంచుతుంది. అందుకే టెన్నిస్ ఆటగాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంటుంది. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం నిజంగా గ్రేట్. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో మాత్రమే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. టెన్నిస్‌లో అయితే క్వార్టర్ ఫైనల్ నుంచి ఫైనల్ వరకు తీవ్ర ఒత్తిడిని ఉంటుంది’ అని విరాట్ చెప్పాడు.
Also Read: Revanth Reddy: యూరియా సరఫరా వేగవంతం చేయండి.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. అనంతరం లండన్‌కు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడడంతో.. విరాట్ ఇప్పట్లో బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు.