‘కార్తీక మాసం’ హిందువులకు అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసం అనగానే.. దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు, శివ-విష్ణువుల పూజ గుర్తుకు వస్తాయి. కార్తీక మాసంలో భక్తులు శివకేశవులను పూజిస్తుంటారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి.. శివాలయాల్లో దీపారాధన చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. అలానే నాగదేవతలకు పూజలు చేస్తారు. కార్తీక సోమవారం రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోయగా.. నాగయ్య ప్రత్యక్షం అయ్యాడు. ఈ అద్భుత దృశ్యం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటుచేసుకుంది.
Also Read: Shreyas Iyer Health Update: శ్రేయస్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన సూర్యకుమార్.. ఏం చెప్పాడంటే?!
నిన్న (అక్టోబర్ 27) కార్తీక సోమవారం. ఈ సందర్భంగా పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలోని వేప చెట్టు వద్ద ఉన్న పుట్టకు భక్తులు పూజలు చేశారు. కొందరు పుట్టలో పాలు పోశారు. దాంతో పుట్టలో నుంచి ఓ భారీ నాగుపాము బయటికొచ్చింది. పుట్టపై పడగ విప్పి.. భక్తుల ముందు సాక్ష్యాత్కరించింది. ముందుగా కాస్త భయపడిన భక్తులు.. ఆపై ఇదంతా దైవ మహిమగా భావించి నాగుపామును దర్శించుకుని పూజలు చేశారు. భక్తులు పాము మీద పసుపు-కుంకుమలు చల్లినా.. పాలు పోసినా ఏమీ అనలేదు. పడగ విప్పి పూజలందుకుంది. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.