Vijayawada Police: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేదంటారు. కానీ బెజవాడ పోలీసులు మాత్రం ఇంటి దొంగను ఇట్టే పట్టేసి జనాల చేత శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. బెజవాడలో గంట వ్యవధిలోనే చోరీ కేసును విజయవాడ పోలీసులు చేధించారు. గవర్నర్ పేటలో రాయల్ ఎలక్ట్రానిక్స్ షాపులో పనిచేస్తున్న ఇంటి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. యోగేష్ పురోహిత్ అనే వర్కర్ ను బ్యాంకులో 5 లక్షలు డిపాజిట్ చేయాలని రాయల్ ఎలక్ట్రానిక్స్ షాపు యజమాని రాజేంద్ర జైన్ పంపించాడు. డబ్బులపై ఆశపడ్డ పురోహిత్ ఆ ఐదు లక్షలను కాగేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే పథకానికి రూపకల్పన చేశాడు.
Read Also: Russian Women : రష్యా మహిళను రాళ్లతో కొట్టారు.. ఎందుకంటే
బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాంక్ వద్ద తనపై దాడి చేసి ఐదు లక్షల రుపాయలతో పరారైనట్లు యజమానికి ఫోన్ చేశాడు. దీంతో గవర్నర్ పేట పోలీసులకు యజమాని రాజేంద్ర జైన్ ఫిర్యాదు చేశాడు. రెండు టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టిన పోలీసులు..సిసి కెమెరాలను పరిశీలించారు. అప్పుడు అసలు నిజం బయటపడింది. పురోహిత్ వేసిన ప్లాన్ బెడికొట్టింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్లో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తానే దొంగిలించానని అంగీకరించాడు. ఇంటి దొంగ యోగేష్ ను అరెస్ట్ చేసి 5 లక్షలు గవర్నర్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.