ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు అకాల మరణం ఎంతో బాధాకరం. వారి అకాలమరణం తీరని లోటు. ప్రధాన అర్చకులుగా బద్రీనాథ్ బాబు అమ్మవారి అలంకరణ, ఆచార వ్యవహారాల్లో అపారమైన అనుభవంతో సేవలందించారు. భక్తులకు తగిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించిన ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని మంత్రి ఆనం పేర్కొన్నారు.