ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే ఫోన్ తీసి రేటింగ్స్ చూసేస్తున్నాం. సినిమా బాగుందా లేదా అని తెలుసుకోవడం మంచిదే కానీ, ఈ రివ్యూలే ఇప్పుడు సినిమాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక సినిమా కోసం కొన్ని వందల మంది పడే కష్టాన్ని కేవలం ఒక స్టార్ రేటింగ్‌తో తేల్చేస్తున్నారు. దీనివల్ల అసలు సినిమా బాగున్నా కూడా జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. దీని పై హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Varanasi : ‘వారణాసి’లో మహేష్‌కి మించి షాక్ ఇవ్వబోతున్న మరో పాత్ర?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర బృందం కోర్టును ఆశ్రయించడంతో, న్యాయస్థానం ఆదేశాల మేరకు బుక్ మై షో తన వెబ్‌సైట్‌లో సమీక్షలను, రేటింగ్స్‌ను నిలిపివేసింది. ఈ పరిణామంపై స్పందించిన విజయ్.. ఎంతోమంది కష్టాన్ని, కలల్ని కాపాడుకోవడానికి ఇదొక మంచి మార్గమని అభిప్రాయపడ్డారు. పనిగట్టుకుని సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేసే వారి వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో సినీ వర్గాలకు పెద్ద ఊరట లభించిందని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు తన పాత అనుభవాలను గుర్తు చేసుకుంటూ..
‘అందరూ కలిసి ఎదగాలనే ఆలోచన లేకుండా, మనవాళ్లే ఇలాంటి కుట్రలు చేయడం బాధాకరం. ‘డియర్ కామ్రేడ్’ విడుదల సమయంలో నా సినిమాపై జరిగిన ఇలాంటి దాడులను చూసి షాకయ్యాను. నా కలను కాపాడుకోవడానికి వీళ్ళతో ఎలా పోరాడాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’ అని విజయ్ ఎమోషనల్ అయ్యారు. చివరకు మెగాస్టార్ వంటి అగ్ర హీరో సినిమాకు కూడా ఇలాంటి ముప్పు పొంచి ఉందని న్యాయస్థానం గుర్తించడం గొప్ప విషయమని, ఇన్నాళ్లకు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ట్విట్టర్ (X) వేదికగా తన మనసులోని మాటను పంచుకున్నారు.