మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇండియా మొత్తానికి.. ప్రపంచ సినిమా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ టైటిల్ రివీల్ ఈవెంట్‌లో చూపించిన ఈ స్పెషల్ గ్లింప్స్‌లో రాజమౌళి చూపించిన కొన్ని విజువల్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. ప్రత్యేకంగా ఎక్కడా లేని ఊహాశక్తితో సృష్టించిన గుహ అలాగే ఆ గుహలో కనిపించిన తలలేని దేవతా రూపం ప్రేక్షకుల్లో పెద్ద క్యూరియాసిటీ రేపుతోంది. ఆ భయంకరమైన దేవత ఎవరు? ఎందుకు ఆమె తల లేదు? సినిమాలో ఆమె పాత్ర ఏమిటి? అనేదానిపై సోషల్ మీడియాలో డిస్కషన్ ఆపకుండా కొనసాగుతోంది. అయితే ఆ దేవత పేరు..
చిన్నమస్తా దేవి.. పురాణాల్లో చిన్నమస్తా దేవి పార్వతి దేవి యొక్క ఉగ్రరూపం గా చెప్పబడుతుంది. “చిన్న” అంటే ఖండించిన, “మస్తా” అంటే తల. అంటే తానే తన తల నరుక్కొన్న దేవత అని. ప్రసిద్ధ కథనం ప్రకారం ‘‘ఒకసారి పార్వతీదేవి తన సేవకులైన ఢాకిని, వర్ణిణితో కలిసి నదిలో స్నానం చేస్తుండగా వారు ఆకలితో నీరసించి పోతారు. వారికి ఆహారం దొరకకపోవడంతో, వారి ఆకలిని తీర్చేందుకు పార్వతి తన తల తానే నరుక్కొని, తన రక్తంతో వారి ఆకలి తిర్చూతుందట. మరో కథనం ప్రకారం రాక్షస సంహారం తర్వాత జయ, విజయల ఆకలి తీర్చేందుకు తానే తల నరుక్కునే రూపమే చిన్నమస్తా. అంతే కాదు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీప రామ్‌నగర్‌లో ఉన్న చిన్నమస్తా దేవి ఆలయం, అలాగే బెంగాల్‌లోని విష్ణుపూర్ పీఠం ఈ రూపానికి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు.
ఇక రాజమౌళి వారణాసిలో ఈ దేవతను ఎందుకు చూపించాడు? కథతో దీని కనెక్షన్ ఏమిటి? అంటూ అభిమానుల్లో సందేహాలు పెరుగుతున్నాయి. మహేశ్ బాబు టైటిల్ రోల్‌లో, ప్రియాంక చోప్రా “మందాకిని”గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ భారీ మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ 2027 సమ్మర్‌లో గ్రాండ్ రిలీజుకు సిద్ధమవుతోంది. ఎం ఎం కీరవాణి సంగీతం, KL నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ పాన్‌వరల్డ్ సినిమా ఇప్పటికే గ్లింప్స్‌తోనే కొత్త ప్రపంచాన్ని చూపించి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.