Vande Bharat Express: వందే భారత్ రైలు భారతదేశంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ప్రీమియం రైలు. ఇది వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడంలో నూతన ప్రమాణాలను సృష్టించింది. ఇటీవల సెప్టెంబర్ 16, 2024 న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలో కొత్త మార్గాల్లో ప్రారంభించబడింది. అయితే ఈ రైళ్లు మొదలైనప్పటి నుండి అప్పుడప్పుడు వీటిపై రాళ్లు విసిరిన అనేక ఘటనలను చూసాము. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి ఘటన వెలుగు చూసింది. ముంబయి నుండి షోలాపూర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సి-11 కోచ్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు రువ్వాడు. ఈ ఘటన జ్యూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాళ్ల దాడి కారణంగా కోచ్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
Also Read: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియా
అయితే, అదృష్టవశాత్తు ఈ దాడి ఘటనలో ప్రయాణీకులెవరూ గాయపడలేదు. కానీ, రైలు భద్రతపై ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. రైల్వే అధికారులు ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. అయితే, రాళ్ల దాడి చేసిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది. వందే భారత్ రైలుపై రాళ్లు రువ్వడం కొత్త విషయం కాదు. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఢిల్లీ-ఉనా వందే భారత్ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది. అప్పుడు భద్రతా దళాలను రైలు ప్రయాణానికి మోహరించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ముంబయి-సోలాపూర్ వందే భారత్ రైలు పై జరిగిన ఈ దాడి భద్రతా వ్యవస్థపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఇటువంటి రైలు పై రాళ్ల దాడి ఘటనలు రైల్వే భద్రతా వ్యవస్థపై తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భద్రతను పటిష్టం చేయడం ద్వారా ఇలాంటి ఘటనలపై నిలిచిపోయే చర్యలు తీసుకోవడం అవసరం.