Beers Looted: రోడ్డుపై ఏదైనా లోడుతో వెళుతున్న వాహనాలు ఆగిపోవడం లేదా బోల్తా కొట్టడం చూస్తుంటాం. అయితే లారీ బోల్తా కొట్టిన సమయంలో అక్కడ ఉన్న వారు.. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఉన్న మనుషుల ప్రాణాల కన్నా.. ఏ వస్తువులు ఉన్నాయా అని చూస్తుంటారు. వస్తువులు, చేపలు, కూరగాయల వంటి నిత్యావసర సరుకులైతే.. వెంటనే వెళ్లి తెచ్చుకుంటారు. వారు తెచ్చుకోవడమే కాదూ.. చుట్టుప్రక్కల వారిని పిలుస్తారు. ఇక ప్రమాదం గురించి పట్టించుకోకుండా.. దొరికినంత దోచుకో అన్న చందంగా..తీరు మారిపోతుంటుంది. ఇటువంటి ఓ సంఘటనే ఆంధ్రపద్రేశ్‌లో జరిగింది. అక్కడ బోల్తా పడింది కూరగాయల వ్యాన్ కాదండోయ్.. బీరుసీసాల వ్యాన్.. ఇంకేముంది!. సీసాల కోసం మందుబాబులు ఎగబడ్డారు. క్షణాల్లోనే అక్కడి సీసాలు మాయమయ్యాయి.
Read Also: Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అదనపు నిధులు
అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై ఓ బీరు వ్యాన్ బోల్తా పడింది. 200 బీరు కేసులతో వెళుతున్న ఈ వ్యాన్ కశింకోట మండలం బయ్యవరం వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడడంతో అందులోని బీరు కేసులన్నీ రోడ్డు పాలయ్యాయి. బీరు వ్యాన్ రోడ్డుపై తిరగబడిందన్న సమాచారం కొన్ని నిమిషాల్లోనే పాకిపోయింది. మందుబాబులు హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పడడంతో కొన్ని బీరు సీసాలు పగిలిపోగా, మిగిలిన వాటికోసం మద్యం ప్రియులు పోటీపడ్డారు. వ్యాన్ బోల్తా నేపథ్యంలో ఆ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోగా, ప్రయాణికులు కూడా చేతికి అందినన్ని బీరు సీసాలు పట్టుకెళ్లారు. వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.
Read Also: Air India Flight: రష్యాలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
పాపం బోల్తా పడిన వ్యాన్‌తో ఆ డ్రైవర్ తల పట్టుకుంటే.. వీళ్లంతా సందట్లో సడేమియా అన్నట్టు పగలకుండా ఉన్న మిగిలిన సీసాలను ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. దొరికిన వాళ్లకు దొరికినంత అన్నట్టుగా.. బీరు సీసాల కోసం ఎగబడ్డారు. పగిలిన సీసా పెంకులు గుచ్చుకుంటాయన్న భయం కూడా లేకుండా.. బీరు బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు పరుగులు తీశారు. అసలే వేసవికాలం కదా.. ఎత్తుకెళ్లిన రెండు బీర్లు ఫ్రిజ్‌లో పెడితే చిల్లుగా లాగించేయొచ్చని ఎగబడ్డారు. అవసరమైన వాళ్లు ఎత్తుకెళ్తుంటే.. వాళ్లని చూసినా మిగతా వాళ్ళు నోరెళ్లపెట్టారు.